జయరామ్ కు వీణ పేరుతో ఫోన్... ఆమె డ్రైవర్ నంటూ అవతారం ఎత్తిన నటుడు సూర్య... మరిన్ని సంచలన విషయాలు!
- వారం ముందే జయరామ్ హత్యకు రాకేశ్ స్కెచ్
- నలుగురితో హత్య విషయాన్ని చర్చించిన వైనం
- దస్ పల్లా హోటల్ నుంచి జయరామ్ ను తీసుకెళ్లింది సూర్య
- మొత్తం ఐదుగురిపై అభియోగాలను నమోదు చేయనున్న పోలీసులు
దస్ పల్లా హోటల్ లో ఉన్న జయరామ్ ను, వీణ అనే యువతి పేరిట ట్రాప్ చేసిన రాకేశ్, ఆమె మాట్లాడినట్టుగా ఓ యువతితో మాట్లాడించి, జయరామ్ ను ఆహ్వానించాడని, కారును పంపుతున్నట్టు చెప్పగా, జయరామ్ వచ్చేందుకు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. దస్ పల్లా హోటల్ కు కారు తీసుకువెళ్లిన సూర్య, తాను వీణా మేడమ్ డ్రైవర్ నని, మిమ్మల్ని తీసుకురమ్మని పంపారని చెప్పి, జయరామ్ ను రాకేశ్ ఇంటికి చేర్చాడు.
ఆపై జయరామ్ తో రూ. 100 బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుని హత్య చేశారని తెలుస్తోందని చెప్పారు. హత్య జరిగే సమయంలో సీన్ లో రౌడీషీటర్ నగేశ్, నగేష్ అల్లుడు విశాల్, రాకేష్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని తేలిందని, ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చనున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేపు మీడియాకు హత్యకు దారితీసిన పరిస్థితులను వివరిస్తామని అధికారులు వెల్లడించారు.