మళ్లీ టీడీపీలోకి రాకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వైసీపీ కార్యకర్తకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపు!
- శ్రీకాకుళంలోని పొందూరుకు చెందిన వ్యక్తి శివ
- గతంలో టీడీపీలో ఉన్నాడు..ప్రస్తుతం వైసీపీ కార్యకర్త
- రవికుమార్ బ్యానర్లను శివ తొలగించినట్టు ప్రచారం
వైసీపీ నేత తమ్మినేని సీతారాం అనుచరవర్గంలో శివ ఉన్నాడు. పొందూరులో కూన రవికుమార్ బ్యానర్లను శివ ఇటీవల తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివకు ఫోన్ చేసి దుర్భాషలాడినట్టు ఆ ఫోన్ కాల్ ఆడియో ద్వారా తెలుస్తోంది. శివ టీడీపీలో ఉండగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని కూన రవికుమార్ ఈ ఆడియోలో ప్రస్తావించడం గమనార్హం.
‘ఒక యాంగిల్లో నన్ను చూశావు. రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే.. నువ్వు చూద్దువు గాని. తమాషా చేస్తున్నావా ఏంది? .. నువ్వేదో, పెద్ద పోటుగాడిలా మాట్లాడొద్దు.. నేను మనిషిని పట్టించుకోనంత వరకే, ఒక మనిషిని పట్టించుకున్నానా అంటే ఎక్కడికి పాతేస్తానో నాకు తెలుసు. ఫైనల్ వార్నింగ్, నీకు చేతనైతే, నీకు విశ్వాసముంటే తెలుగు దేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగు’ అని, లేకపోతే, ఏం చేయాలో అది చేస్తానని కూన రవికుమార్ హెచ్చరించడం ఆ ఆడియోలో వినపడుతుంది.
‘నువ్వు తిరగబడుతున్నావు. తిరగబడితే మాత్రం పాతాళానికి తొక్కేస్తాను’ అని శివను కూన రవికుమార్ హెచ్చరించారు. ‘మీకు నేను సాటేంటి సార్. డిస్ట్రబెన్స్ వల్ల నేను బయటకు వెళ్లాను సార్..’ అని శివ బదులివ్వడం ఈ ఆడియోలో వినపడుతుంది. ఈ రికార్డు చేసిన వీడియోను వైసీపీ నాయకులకు శివ వినిపించాడు. దీంతో, ఈ అంశాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తీసుకున్నారు. ఈ ఆడియోను సామాజిక మాధ్యమాలకు చేర్చారు.
కాగా, కూన రవికుమార్ కు మేనమామ తమ్మినేని సీతారం. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ చార్జిగా తమ్మినేని ఉన్నారు. వీరి మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ ఈ ఆడియో వ్యవహారం కారణంగా వారి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది.