చట్టంతో ఆడుకోవద్దు... తీవ్రమైన చర్యలుంటాయి!: కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టు వార్నింగ్
- విదేశాలకు వెళ్లేందుకు కార్తీని అనుమతించిన సుప్రీంకోర్టు
- రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలంటూ ఆదేశం
- విచారణ సంస్థలకు సహకరించకపోతే.. తీవ్ర చర్యలంటూ హెచ్చరిక
మార్చి 5, 6, 7, 10 తేదీల్లో ఈడీ ముందు హాజరుకావాలని ఈ సందర్భంగా కార్తీని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు తమ వద్ద రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని తెలిపింది. టెన్నిస్ టోర్నమెంట్లకు గాను ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూకే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లకు వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా సుప్రీంను కార్తీ కోరారు.
ఈ నేపథ్యంలో, గత వారం ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... కేసు విచారణకు సంబంధించి కార్తీ ఎప్పుడు హాజరుకావాలో తేదీలను తమకు అందజేయాలని ఈడీని సుప్రీం సూచించింది. అయితే, విచారణకు కార్తీ సహకరించడం లేదని... దీంతో, అతన్ని విదేశాలకు వెళ్లేందుకు అనుమతించవద్దని సుప్రీంను ఈడీ కోరింది. కార్తీ విదేశీ పర్యటనల వల్ల తమ విచారణ నెమ్మదిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో, కార్తీకి కండిషన్లతో కూడిన అనుమతిని సుప్రీంకోర్టు ఇచ్చింది.