ఓ 'సెక్రటరీ', ఓ 'మీనా', ఓ 'జీవన తరంగాలు'... కాల్పనిక జగత్తులో తిరుగులేని నవలారాణి!
- నవలా ప్రపంచం నుంచి రాలిన ధ్రువతార
- మారుతున్న జీవన విధానాన్ని అనుసరించి రచనలు
- ఎంతో మంది దర్శక, నిర్మాతలకు హిట్లిచ్చిన యద్దనపూడి నవలలు
చదివే పాఠకులకు అద్యంతం ఆసక్తిని, ఉత్కంఠను కలిగించే యద్దనపూడి, 1965లో 'మనుషులు - మమతలు' చిత్రానికి కథను అందించగా, ఆపై ఎన్నో నవలలు సినిమాలుగా రూపొందించబడ్డాయి. ఆమె రాసిన ఎన్నో నవలలను ప్రముఖ దర్శక నిర్మాతలు, తమ సినిమాలకు కథగా తీసుకుని హిట్ సాధించారు. ఆమె చేతి నుంచి జాలువారిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మగౌరవం నవలలు చిత్రాలుగా రాగా, రాధ మధు నవల టీవీ ధారావాహికగా వచ్చింది. ఆమె రాసిన కీర్తి కిరీటాలు, అమృతధార, ఆభిజాత, గిరిజా కల్యాణం, ఆరాధన, అనురాగ గంగ, జాహ్నవి, నిశాంత, ప్రేమపీఠం, బంగారు కలలు, శ్వేత గులాబి, సౌగంధి, సుకుమారి వంటి నవలలను తెలుగు పాఠకలోకం ఎన్నడూ మరువదు.