girl raped in theater: హైదరాబాదు థియేటర్ లో అత్యాచారం... ఆలస్యంగా ఫిర్యాదు!
- యువతికి ఫేస్ బుక్ రిక్వెస్ట్ పంపిన భిక్షపతి
- రెండు రోజుల తరువాత యాక్సెప్ట్, ఛాటింగ్, పది రోజుల తరువాత ప్రేమ
- జనవరి 29న లైంగిక దాడి
సికింద్రాబాదులోని ప్రశాంత్ ధియేటర్ లో అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగాం, నర్మెట గ్రామానికి చెందిన కె.భిక్షపతి (23) జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్ ద్వారా సికింద్రాబాద్ కు చెందిన ఇంటర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్న యువతి (19) రెండు నెలల క్రితం పరిచయమైంది. ఈ పరిచయం పదిరోజుల ఛాటింగ్ తో ప్రేమగా మారింది. దీంతో భిక్షపతి ఆమెను పెళ్లిచేసుకుంటానని మాటిచ్చాడు.
ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం జగద్గిరిగుట్టలో ఉంటున్న సోదరి ఇంటికి భిక్షపతి వచ్చాడు. దీంతో ఇద్దరూ కలుద్దామని నిర్ణయించుకున్నారు. జనవరి 29న ఇందిరాపార్కుకు వెళ్లి, మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ప్రశాంత్ థియేటర్ లో 'పద్మావత్' సినిమా చూసేందుకు వెళ్లారు. థియేటర్ ఖాళీగానే ఉండడంతో ఓ మూలన కూర్చున్నారు.
సినిమా చూస్తుండగానే భిక్షపతి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరువు తీస్తానని బెదిరించాడు. అనంతరం రక్తస్రావం ఆగకపోవడంతో తల్లిదండ్రులు నిలదీయగా ఆమె జరిగిన విషయం వివరించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.