nawajiddin siddiqui: నన్ను క్షమించండి.. నా ఆత్మకథ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నా!: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ
- 'యాన్ ఆర్డినరీ లైఫ్ 'పుస్తకంలో మాజీ ప్రియురాళ్ల గురించి ప్రస్తావన
- సిద్ధిఖీపై మండిపడ్డ మాజీ ప్రియురాళ్లు
- మనోభావాలను దెబ్బతీసి ఉంటే క్షమించమని వేడుకున్న సిద్ధిఖీ
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆత్మకథ పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంపై ఆయన మాజీ ప్రియురాళ్లు తీవ్రంగా మండిపడ్డారు. పుస్తకంలో సిద్ధిఖీ చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో, తన ఆత్మకథ పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సిద్ధిఖీ ప్రకటించాడు. పుస్తకంలోని తన జ్ఞాపకాలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
'యాన్ ఆర్డినరీ లైఫ్' పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్ వర్ లకు సంబంధించిన అంశాలను సిద్ధిఖీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ స్పందిస్తూ, పుస్తకం అమ్ముడుపోవడానికి సిగ్గు లేకుండా, అబద్ధపు కథనాలను రాశాడంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ లో నిహారిక ఫిర్యాదు కూడా చేసింది. సిద్ధిఖీ పిచ్చి ఆలోచనలను భరించలేకే... తాను అతనికి దూరమయ్యానంటూ సునీత తెలిపింది.