Wales prince: యువరాజు చేతిలోని పాప్ కార్న్ ను చోరీ చేసిన రెండేళ్ల పాప.. వీడియో వైరల్!
- టోరొంటోలో ఇన్విక్టస్ గేమ్స్‌ను చూడడానికి వచ్చిన వేల్స్ యువరాజు
- ఆయన వద్దకు వచ్చి అలరించిన చిన్నారి
- విషయం తెలుసుకుని చిన్నారిని దగ్గరకు తీసుకున్న యువరాజు
టోరొంటోలో జరిగిన ఇన్విక్టస్ గేమ్స్‌ను చూడడానికి వచ్చిన వేల్స్ యువరాజు హ్యారీ (33) కి కొత్త ఫ్రెండ్ దొరికింది. ఆమె వయసు రెండు సంవత్సరాలు. ఎమిలి హెన్సన్ అనే రెండేళ్ల పాప తన చిన్ని చేతులతో హ్యారీ చేతిలో ఉన్న పాప్‌కార్న్‌ను చోరీ చేసి, అందర్నీ ఆకర్షించింది. గేమ్స్ లో భాగంగా వీల్‌చైర్ వాలీబాల్ ఫైనల్ పోరును చూడడానికి సదరు యువరాజు తన గర్ల్ ఫ్రెండ్ మేఘన్ మార్క్లేతో కలిసి వచ్చాడు.
వారి వద్దకు వచ్చిన ఆ పాప మెల్లిగా హ్యారీ చేతిలో ఉన్న పాప్‌కార్న్‌ను తీసుకుని తినడం ప్రారంభించింది. హ్యారీ ఆ సమయంలో తన ఎడమ పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ పాప మూడు నాలుగు సార్లు పాప్‌కార్న్‌ను తీసుకుని తిన్న తరువాత హ్యారీ చివరికి ఆ విషయాన్ని గుర్తించాడు.
ఆ చిన్నారి చనువుకు నవ్వుకున్న హ్యారీ, ఆ పాపతో కాసేపు సరదాగా మాట్లాడాడు. ఆ పాప గతంలో ఇన్విక్టస్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారుడు డేవిడ్ హెన్సన్ కూతురు. ఆయన హార్రీకి మంచి మిత్రుడు కూడా. ఈ దృశ్యం అక్కడి కెమెరాలో నిక్షిప్తం అయి, సోషల్ మీడియాలోకి ఎక్కేసి అందరినీ అలరిస్తోంది.