హనుమంతుని కార్య దీక్ష
హనుమంతుడితో పరిచయం కాగానే ఆయనలోని కార్యదీక్షను శ్రీరాముడు గమనించాడు. ఆ తరువాత ఆయన లోని స్వామిభక్తిని పూర్తిగా విశ్వసించాడు. అందువల్లనే సీతమ్మవారిని వెతకడానికి బయలుదేరుతోన్న వారిలో హనుమంతుడికి మాత్రమే తన ఉంగరాన్ని ఇచ్చాడు. శ్రీరాముడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే ఆలోచన తప్ప హనుమకు మరే ఆలోచన లేదు. అలా ఆకాశ మార్గాన వెళుతోన్న ఆయనను పర్వతుడనే మైనాకుడు చూశాడు. హనుమను ఆత్మీయంగా పలకరిస్తూ .. కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరమని కోరాడు.
శ్రీరాముడు అప్పగించిన పనిపై వెళుతున్నాననీ, ఎక్కడ కాసేపు విశ్రమించినా స్వామి అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందని అన్నాడు హనుమంతుడు. మైనాకుడి మనసు బాధపడకూడదనే ఉద్దేశంతో, ఆ పర్వతాన్ని స్పృశిస్తూ ముందుకు సాగాడు. కార్యదీక్షలో వున్న వారు ఎక్కడ ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదనీ .. పని పూర్తయ్యేంత వరకూ విశ్రమించకూడదని ఈ సంఘటన ద్వారా హనుమంతుడు చాటిచెప్పాడు. ఈ కారణంగానే శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుడితో అభినందనలు అందుకున్నాడు.