ఇది శివుడి లీలావిశేషమే
పరమశివుడు ఆవిర్భవించిన ఆలయాలు .. ఆ స్వామి మహిమలకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆయన లీలావిశేషాలకు ప్రతీకగా కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటున్నాయి. అలా ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఒరిస్సా - బాలాసోర్ జిల్లా 'కుంభీర్ గాడి' గ్రామ పరిధిలో దర్శనమిస్తుంది. ఇక్కడి శివలింగం .. పైకి ఆరడుగుల వరకు మాత్రమే కనిపిస్తుంది. దాని పీఠభాగం ఎంతవరకూ వుందనేది ఎవరికీ తెలియదు.
ఈ శివలింగాన్ని మరో ప్రదేశానికి తరలించి అక్కడ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. లింగం అడుగుభాగం ఎక్కడి వరకూ ఉందనే విషయాన్ని వాళ్లు కనుగొనలేకపోయారు. అది స్వామి మహిమగా భావించిన ఆ గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించారు. 'భుసందేశ్వరుడు'గా స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. స్వామి అక్కడ ప్రత్యక్షంగా వున్నాడని భావించిన భక్తులు, విశేషమైన పర్వదినాల్లో మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుస్తుంటారు.