వేదాద్రికి అందుకే ఆ పేరు
హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం స్వామి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రాల్లో 'వేదాద్రి' ఒకటి. కృష్ణా నదీ తీరంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో .. సుందరమైన గోపురాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. రాజ్యలక్ష్మీ .. చెంచులక్ష్మీ సమేతంగా స్వామివారు పూజలందుకుంటూ ఉండటం ఇక్కడి విశేషం.
ఈ క్షేత్రానికి 'వేదాద్రి' అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించిన సోమకాసురుడిని, మత్స్యావతారాన్ని ధరించిన శ్రీమహా విష్ణువు సంహరిస్తాడు. ఆ వేదాల సన్నిధిలో తాను నరసింహ అవతారంలో కొలువై ఉంటానని వేదరాశికి మాట ఇస్తాడు. దాంతో ఇక్కడి కృష్ణానదిలో వేదరాశి గుప్తంగా ఉండిపోయింది. ఆ తరువాత స్వామి నరసింహ అవతారాన్ని ధరించి .. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు 'వేదరాశి' .. వేదాచలంగా బహిర్గతం అయింది. దాంతో ఈ క్షేత్రానికి 'వేదాద్రి' అనే పేరు వచ్చింది.