వాల్మీకీ పురమే వాయల్పాడు
శ్రీరామచంద్రుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో 'వాయల్పాడు' ఒకటి. ఇది చిత్తూరు జిల్లా పరిధిలో కనిపిస్తుంది. ఇక్కడి సీతారాములు .. భరత .. లక్ష్మణ .. శత్రుఘ్నులతో కలిసి దర్శనమిస్తుండటం విశేషం. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని 'పట్టాభి రామాలయం'గా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఇక్కడి స్వామివారిని 'జాంబవంతుడు' ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది.
ఈ క్షేత్రానికి 'వాయల్పాడు' అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడికి సమీపంలో గల కొండపైన 'వాల్మీకి మహర్షి' తపస్సు చేసుకున్నాడట. అందువలన ఈ గ్రామాన్ని వాల్మీకీ పురంగా పిలుచుకునేవారు. కాలక్రమంలో 'వాయల్పాడు' గా రూపాంతరం చెందిందని చెబుతారు. వాల్మీకి మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన .. జాంబవంతుడి ప్రతిష్ఠ కావడం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకున్న అన్నమయ్య, పలు కీర్తనలు రచించడం విశేషం.