గంధమాదన పర్వతం ప్రత్యేకత
రామ నామాన్ని స్మరించినా చాలు .. రామేశ్వరాన్ని దర్శించినా చాలు అని పెద్దలు చెబుతుంటారు. రామనామం మహా శక్తిమంతమైంది. హనుమంతుడు మొదలు ఎంతోమంది రామ భక్తులు ఆ నామం యొక్క మహిమను లోకానికి చాటి చెప్పారు. ఇక శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమిగా రామేశ్వరం కనిపిస్తుంది. అందుకే రామేశ్వరాన్ని దర్శించడానికి భక్తులు ఆసక్తిని చూపుతుంటారు.
రామేశ్వరం అనేక విశేషాల సమాహారంగా అనిపిస్తుంది. అలాంటివాటిలో 'గంధ మాదన పర్వతం' ఒకటిగా దర్శనమిస్తుంది. ఇక్కడి రామాలయం ప్రశాంతతకు ప్రతీకగా అలరారుతోంది. శ్రీరామచంద్రుడి పాద పద్మాల చిహ్నాలను ఇక్కడ దర్శించుకోవచ్చు. రావణాసురుడిని సంహరించి వెనుతిరిగిన రాముడు ఈ కొండపైకి చేరుకున్నాడట. బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తిని పొందడం కోసం, ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసినట్టి స్థలపురాణం చెబుతోంది. అందుకే ఇక్కడి శివుడు రామలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు.