ఏటీఎం సేవలు మరింత ప్రియం... మే 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధ‌న‌లు!

ఏటీఎం సేవలు మరింత ప్రియం... మే 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధ‌న‌లు!
  • ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపున‌కు ఆమోదించిన ఆర్‌బీఐ
  • ఇకపై ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే అదనంగా వ‌సూలు
  • ఆర్ధిక లావాదేవీలకు రూ. 2, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 1 మేర ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపు
  • ఆర్‌బీఐ ఆమోదం
ఏటీఎం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపున‌కు ఆమోదించింది. ఇక‌పై ఆర్థిక లావాదేవీల కోసం ఏటీఎంలపై ఆధారపడే వినియోగదారులు వారి ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి కొత్త ఏటీఎం నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  

ఆర్‌బీఐ ఇంటర్‌చేంజ్ ఫీజులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తే అదనంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలకు రూ. 2, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 1 మేర ఇంటర్‌చేంజ్ ఫీజు పెంపునకు ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ కొత్త ఛార్జీలు మే 1 నుంచి అమల్లో రానున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని వాదించిన వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థనల మేర‌కు ఆర్‌బీఐ ఈ ఛార్జీలను సవరించాలని నిర్ణయించింది.

ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ఏటీఎంను వేరే బ్యాంక్ కస్టమర్ ఉపయోగిస్తే ఆ బ్యాంకుకు చెల్లించాల్సిన ఫీజు. సాధారణంగా ఇది మొత్తం లావాదేవీలో 1 శాతం ఉంటుంది. ఇప్పుడు ఆర్‌బీఐ ఈ ఫీజుల్ని సవరించడంతో ఇంటర్‌చేంజ్ రూ. 17 నుంచి రూ. 19కు పెరిగింది. ఖాతా బ్యాలెన్స్‌ల తనిఖీ వంటి సేవలకు రూ. 6 నుంచి రూ. 7కు పెంచారు. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకు ఏటీఎంలను నెలలో ఐదు సార్లు ఫ్రీగా వాడవచ్చు. నాన్ మెట్రో ప్రాంతాల్లో నెలకు 3 ఉచిత అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఈ ప‌రిమితులు దాటితే ఇంటర్‌చేంజ్ ఫీజు ప‌డుతుంది. 

ఇక ఇండియాలో డిజిటల్ చెల్లింపుల విలువ 2014 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 952 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వ డేటా పేర్కొంది. అయితే, 2023 ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి ఈ సంఖ్య రూ.3,658 లక్షల కోట్లకు పెరిగింది. 


More Telugu News