'బ్రో' అని సంబోధించాడని... స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఫ్లాట్ యజమాని దాడి

'బ్రో' అని సంబోధించాడని... స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఫ్లాట్ యజమాని దాడి
  • డెలివరీ బాయ్ పై ఫ్లాట్ యజమాని దాడి
  • ‘బ్రో’ అని పిలిచినందుకు ఆగ్రహం
  • అపార్ట్ మెంట్ వద్ద డెలివరీ బాయ్స్ ఆందోళన
  • కేసు నమోదు చేస్తామని పోలీసుల హామీ
'బ్రో' అని సంబోధించాడని ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఫ్లాట్ యజమాని దాడి చేయడం విశాఖపట్నంలో కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు.

ఆందోళనకారుల కథనం ప్రకారం, సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్‌లో 29వ అంతస్తులో నివసిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అనిల్ ఫుడ్ పార్శిల్‌తో ప్రసాద్ ఫ్లాట్‌కు వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టగానే ఒక మహిళ వచ్చి, అనిల్ మాటలు అర్థం కాక ప్రసాద్‌కు తెలియజేసింది. ప్రసాద్ బయటకు వచ్చి అడగగా, అనిల్ "మీకు ఫుడ్ పార్శిల్‌ వచ్చింది బ్రో" అని చెప్పాడు.

దీంతో ఆగ్రహించిన ప్రసాద్, "సార్ అని కాకుండా బ్రో అంటావా?" అంటూ అనిల్‌పై దాడి చేశాడు. ఆపై సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అనిల్‌ను కొట్టి, బట్టలు విప్పించి అండర్‌వేర్‌తో గేటు బయట నిలబెట్టాడు. క్షమాపణ కోరుతూ ఒక లేఖ రాయించుకున్నాడు.

ఈ అవమానంతో మనస్తాపం చెందిన అనిల్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని పుకార్లు వ్యాపించాయి. దీంతో డెలివరీ బాయ్స్ ఆక్సిజన్ టవర్స్ వద్ద గుమిగూడి నిరసన తెలిపారు. అనిల్‌పై దాడి చేసి అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని అనిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనిల్ క్షేమంగా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.


More Telugu News