ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్
  • పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపు
  • దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షను చూపిస్తోందన్న కేటీఆర్
  • జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్న కేటీఆర్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలు జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని అన్నారు.


More Telugu News