రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు

- ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
- కొన్ని చోట్ల వడగళ్ల వానలు
- ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గే అవకాశం
ద్రోణి కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.