పెట్రోల్ నింపేంత సమయంలోనే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్.. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టం వచ్చేసింది!

పెట్రోల్ నింపేంత సమయంలోనే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్.. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టం వచ్చేసింది!
  • ఈవీల విషయంలో తొలగనున్న ప్రధాన అడ్డంకి..
  • చైనాలో అందుబాటులోకి రానున్న కొత్త ఛార్జింగ్ వ్యవస్థ
  • పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలుకు వెనుకాడే వారిలో చాలామంది చెప్పే మాట.. ‘గంటల తరబడి ఛార్జింగ్ పెట్టినా లాంగ్ డ్రైవ్ కు వెళ్లాలంటే టెన్షన్ పడుతుంటాం. ఛార్జింగ్ అయిపోతే తిప్పలు పడాల్సిందే’.. ఇతర వాహనాలైతే ఏంచక్కా రోడ్డుపై ఎక్కడ బంక్ కనిపిస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించుకుని టెన్షన్ లేకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని చెబుతుంటారు. అయితే, చైనాకు చెందిన ఓ కంపెనీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలో వాహనం బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసే సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే పెట్రోల్ బంక్ లోకి వెళ్లి వాహనంలో ట్యాంక్ ఫుల్ చేయించేలోపే ఈవీ వాహనం బ్యాటరీ ఫుల్ అయిపోతుందన్నమాట.

ప్రస్తుతం ఈ అల్ట్రా ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ వ్యవస్థను చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు బీవైడీ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడున్న విద్యుత్‌ వాహనాల బ్యాటరీలను తమ 1 మెగావాట్‌ ఫ్లాష్‌ ఛార్జర్లు 5-8 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ చేయగలవని వివరించింది. చైనా వ్యాప్తంగా 4 వేలకు పైగా కొత్త ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం కస్టమర్లకున్న అభ్యంతరాలు తొలగిపోయి అమ్మకాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఫ్లాష్‌ ఛార్జింగ్‌ వ్యవస్థను సిలికాన్‌ కార్బైడ్‌ పవర్‌ చిప్స్‌తో, 1500 ఓల్ట్‌ల స్థాయి వరకు బీవైడీ కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసింది. ఈ సంస్థ రూపొందించిన బ్లేడ్‌ లిథియం-అయాన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీ, ప్రపంచంలోనే అత్యంత భద్రమైన, సామర్థ్యం కలిగిన ఈవీ బ్యాటరీ అని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News