ఛత్రపతి శివాజీ పునర్జన్మే మోదీ.. లోక్ సభలో బీజేపీ ఎంపీ వ్యాఖ్య.. వీడియో ఇదిగో!

ఛత్రపతి శివాజీ పునర్జన్మే మోదీ.. లోక్ సభలో బీజేపీ ఎంపీ వ్యాఖ్య.. వీడియో ఇదిగో!
--
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ ఒకరు లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఛత్రపతి శివాజీయే మోదీ రూపంలో మళ్లీ జన్మించారని వ్యాఖ్యానించడంపై సభలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బార్ గఢ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ప్రదీప్ పురోహిత్ మంగళవారం లోక్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా గతంలో ఓ సాధువుకు తనకు మధ్య జరిగిన సంభాషణను సభ్యులకు వివరించారు. మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన ఛత్రపతి శివాజీ మహరాజ్ ఈ జన్మలో ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో పునర్జన్మ ఎత్తారని ఆ సాధువు చెప్పారన్నారు.

నాటి మరాఠా సామ్రాజ్య ఖ్యాతిని ఛత్రపతి శివాజీ దశదిశల చాటారని, ప్రస్తుతం నరేంద్ర మోదీ కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా నిలబెట్టేందుకు పాటుపడుతున్నారని వివరించారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి శివాజీ మహరాజ్ పునర్జన్మ పొందారని ఎంపీ నొక్కి చెప్పారు. కాగా, ఎంపీ ప్రదీప్ పురోహిత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తో ప్రధాని మోదీని పోల్చడం కరెక్ట్ కాదని, ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News