పాక్ క్రికెట్ ఇంతగా ప‌త‌నం కావ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం అదే: ఇంజ‌మాముల్ హ‌క్‌

పాక్ క్రికెట్ ఇంతగా ప‌త‌నం కావ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం అదే: ఇంజ‌మాముల్ హ‌క్‌
  • పాక్ క్రికెట్ ఇంతగా ప‌త‌నం కావ‌డంప‌ట్ల మాజీ కెప్టెన్ ఆందోళ‌న
  • చాలా విష‌యాల్లో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌ట‌మే ప‌త‌నానికి కార‌ణ‌మ‌న్న ఇంజీ
  • కూర్చుని తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో ఆలోచించాలని సూచ‌న‌ 
  • త‌ర‌చుగా ఆట‌గాళ్ల‌ను మార్చ‌డం వ‌ల్ల వారి ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తింటుంద‌ని వెల్ల‌డి
గ‌త కొంత‌కాలంగా పాకిస్థాన్ క్రికెట్ ఘోరంగా ప‌త‌నం అవుతున్న విష‌యం తెలిసిందే. ప్రధానంగా ఐసీసీ ఈవెంట్ల‌లో ఆ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌నను కొన‌సాగిస్తోంది. ఇటీవ‌ల తాను ఆతిథ్య‌మిచ్చిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ పాక్ ఒక్క విజ‌యం కూడా న‌మోదు చేయ‌కుండానే లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆట‌గాళ్ల‌పై మాజీలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇది ఇలాగే కొన‌సాగితే మునుముందు పాక్ జ‌ట్టుకు తీవ్ర‌ ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇక పాక్ క్రికెట్ ఇంతగా ప‌త‌నం కావ‌డంప‌ట్ల ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజ‌మాముల్ హ‌క్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. చాలా విష‌యాల్లో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. త‌ర‌చుగా జ‌ట్టు, సిబ్బందిలో మార్పులు చేయ‌డం వల్ల సమస్య పరిష్కారం కాద‌ని, కూర్చుని తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో ఆలోచించాలని తెలిపాడు.  

పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త‌న త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల‌న్నారు. గ‌త రెండేళ్లుగా చేస్తున్న త‌ప్పుల‌ను పున‌రావృతం చేయకూడ‌ద‌ని సూచించాడు. రెండేళ్లుగా పాక్ క్రికెట్ ప‌త‌న‌మ‌వుతోంద‌ని, స‌రైన దిశ‌లో ప‌నిచేయ‌క‌పోతే మ‌రింత క్షీణిస్తుంద‌ని హెచ్చ‌రించాడు. విప‌రీతంగా మార్పులు చేయ‌డం వ‌ల్ల ప్లేయ‌ర్ల ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తింటుంద‌ని, పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని ఇంజ‌మాములు చెప్పుకొచ్చాడు.  


More Telugu News