గాజాపై ఇజ్రాయెల్ దాడిపై అమెరికా రియాక్షన్ ఇదే!

గాజాపై ఇజ్రాయెల్ దాడిపై అమెరికా రియాక్షన్ ఇదే!
  • ఇజ్రాయెల్ తమకు ముందే సమాచారం ఇచ్చిందన్న వైట్ హౌస్
  • కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇదే భారీ దాడి
  • బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందంటూ ఇజ్రాయెల్ పై హమాస్ ఆగ్రహం
హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాలో సుమారు 200 మంది వరకు చనిపోయారని సమాచారం. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని మండిపడింది.

ఈ దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు ముందస్తు సమాచారం ఇచ్చిందని తెలిపింది. తమను సంప్రదించాకే దాడి చేసిందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లకు, హుతీలకు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ చెప్పారు.

బందీలను విడిచిపెట్టాలని, గాజాను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హమాస్ ను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ప్రస్తుతం దాని ఫలితం అనుభవిస్తోందని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు, బందీల అప్పగింతకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే గాజాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు.



More Telugu News