నాగ్ పూర్ లో అల్లర్లు, కర్ఫ్యూ.. దాడుల వీడియోలు ఇవిగో!

నాగ్ పూర్ లో అల్లర్లు, కర్ఫ్యూ.. దాడుల వీడియోలు ఇవిగో!
  • ఔరంగజేబ్ సమాధి తొలగించాలని హిందూ సంఘాల ఆందోళనలు
  • నాగ్ పూర్ లో పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలు
  • శాంతియుతంగా ఉండాలంటూ సీఎం ఫడ్నవీస్ పిలుపు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం నాగ్ పూర్ లో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఔరంగజేబ్ సమాధిని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు నాగ్ పూర్ లోని మహల్ ఏరియాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీగా వెళుతున్న వీహెచ్ పీ కార్యకర్తలపై ఓ వర్గానికి చెందిన యువకులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. మహల్ ఏరియాలో అల్లర్లు చెలరేగాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేసిన దుండగులు, కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీ చార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

నాగ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటనలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 39 మందిని అరెస్టు చేసినట్లు నాగ్ పూర్ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. కాగా, వదంతులు నమ్మొద్దని, శాంతియుతంగా ఉండాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్ పూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాగ్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో స్పందించారు. హింసకు పాల్పడ వద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.


More Telugu News