రోహిత్ శర్మకు గంగూలీ కీలక సూచన

రోహిత్ శర్మకు గంగూలీ కీలక సూచన
  • టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా ప్రదర్శనపై గంగూలీ అసంతృప్తి
  • రోహిత్ తన తప్పులను సరిదిద్దుకోవాలన్న గంగూలీ
  • ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాలని సూచన
భారత క్రికెట్ జట్టు గత ఐదు నెలల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద పది టెస్టు మ్యాచ్‌లు ఆడగా, కేవలం మూడు మాత్రమే గెలిచింది. బంగ్లాదేశ్‌ను 2-0 తో ఓడించినా న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, తర్వాత మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. 1-3 తేడాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. రోహిత్ శర్మకు కీలక సూచనలు చేశారు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ తన తప్పులు సరిదిద్దుకోవాలని గంగూలీ సూచించారు. 
 
టీమిండియాకు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ సారధిగా వ్యవహరించినప్పుడు అతని అట తీరు గొప్పగా ఉందని, వైట్ బాల్ క్రికెట్‌లో అతను ఎంతో సాధించాడని గంగూలీ అన్నారు. టెస్టు క్రికెట్‌లో కూడా అతను టీమిండియాను విజయపథంలో నడిపించాలన్నారు. 

ప్రస్తుతం రెడ్ బాల్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన సరిగా లేదని, కానీ ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నారు. ఈ దిశగా జట్టును నడిపించడానికి రోహిత్ శర్మ మార్గాన్ని అన్వేషించాలని గంగూలీ సూచించారు.    


More Telugu News