ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు ఉన్న ఫోన్లలో ఈ ఎస్‌బీఐ యాప్ పనిచేయదు!

  • ఆండ్రాయిడ్ 11 ఫోన్లకు సపోర్ట్ నిలిపివేసిన యోనో యాప్
  • భద్రత, పనితీరు మెరుగుదలే ప్రధాన కారణం.
  • యూజర్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవాలని ఎస్‌బీఐ సూచన
  • లేదా కొత్త వెర్షన్ ఫోన్లు వినియోగించాలని వివరణ
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్ వెలువడింది. ఎస్‌బీఐ యోనో (YONO) మొబైల్ యాప్ ఇకపై ఆండ్రాయిడ్ 11 మరియు అంతకంటే ముందు వెర్షన్లలో పనిచేయదని బ్యాంక్ స్పష్టం చేసింది. భద్రత, యాప్ పనితీరు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 

ఆండ్రాయిడ్ పాత వెర్షన్లలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి ఈ మార్పు అవసరమని భావిస్తున్నట్టు వెల్లడించింది. 

చాలామంది వినియోగదారులు పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో YONO యాప్ ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు చేశారు. ప్లే స్టోర్ సమీక్షలలో కూడా ఈ సమస్యను గురించి ప్రస్తావించారు. తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ పనిచేయడం లేదని కొందరు వినియోగదారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 

కాగా, ఆండ్రాయిడ్ 11 మరియు అంతకంటే ముందు వెర్షన్లలో పనిచేసే శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 5జీ, గూగుల్ పిక్సెల్ 4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జీ, వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 9 ప్రో, పోకో ఎక్స్3 ప్రో ఫోన్లలో ఇకపై యోనో యాప్ ను యాక్సెస్ చేయలేరు. యూజర్లు తమ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని లేదా కొత్త వెర్షన్‌కు మద్దతు ఇచ్చే ఫోన్లను ఉపయోగించాలని ఎస్‌బీఐ సూచించింది.


More Telugu News