వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతున్నారు: నారా లోకేశ్

వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతున్నారు: నారా లోకేశ్
  • సభా సమావేశాల నుంచి నేడు వైసీపీ సభ్యుల వాకౌట్
  • బయట ఉన్న వైసీపీ సభ్యులను మార్షల్స్ సాయంతో లోపలికి తీసుకురావాలన్న లోకేశ్
  • చైర్మన్ కు ఆ అధికారం ఉందని వెల్లడి
వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ అంశంపై సభలో చర్చలో పాల్గొనకుండా, వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలిలో 2019-24 మధ్య అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. 

"సభా సమావేశాల అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. అందరూ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారు. బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారు. చర్చలో వైసీపీ సభ్యులు 2014-19 మధ్య జరిగిన పాలనపై ఆరోపణలు చేసి.. ఇప్పుడు సమాధానం ఇస్తుండగా వాకౌట్ చేస్తున్నారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారు. సమాధానానికి సమయం ఇవ్వరు. మేం సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరు. ఇది మొదటిసారి కాదు... పదేపదే ఈ విధంగా చేస్తున్నారు. 

గతంలో మార్షల్స్ ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి చూశాం. ఇప్పుడు మార్షల్స్ ను పెట్టి బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలని ఛైర్మన్ ను కోరుతున్నాం. ఆ అధికారం ఛైర్మన్ కు ఉంది. 2014-19 మధ్య పాలనపై వైసీపీ సభ్యులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు పెట్టారో చూశాం. చేయని తప్పునకు చంద్రబాబు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. మొదట రూ.3వేల కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత రూ.300 కోట్లని, తర్వాత రూ.27 కోట్లు అని అన్నారు. చేయని తప్పునకు జైలుకు పంపారు. 

అచ్చెన్నాయుడు గారిని, ధూళిపాళ్ల నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని.. అందరినీ ఇబ్బంది పెట్టారు. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ బయటపడతాయని భయపడుతున్నారా? ఆరోపణలు చేసి పారిపోతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మా నాయకులు చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు యత్నించారు. ఆ కేసులపై చర్చించాలి. నాపైనా 23 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. హత్నాయత్నం కేసు పెట్టారు. చర్చకు లేకుండా పారిపోయారు. ఇది సరికాదు" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.


More Telugu News