ఆ విషయం తెలిసి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు: డీకే అరుణ

  • ఎవరి పైనా అనుమానం లేదన్న డీకే అరుణ
  • ఆగంతుకుడు ఇంట్లో ఏమీ ముట్టుకోకుండా వెళ్లాడన్న ఎంపీ
  • భద్రత పెంచమని కోరితే రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని వ్యాఖ్య
తన ఇంట్లోకి ఆగంతుకుడు చొరబడిన విషయం తెలుసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. తనకు ఎవరి పైనా అనుమానం లేదని ఆమె వెల్లడించారు. తన వద్ద పని చేసిన వారు అని తాను అనుకోవడం లేదని ఆమె అన్నారు. ఈ మేరకు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఆగంతుకుడు తమ ఇంట్లో ఏమీ ముట్టుకోకుండానే వెళ్లిపోయాడని చెప్పారు.

రాజకీయంగా తనపై కక్ష కట్టి ఎవరైనా పంపించారో తెలియదని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని వెల్లడించారు. దర్యాఫ్తు పూర్తయితే గానీ ఏం జరిగిందో స్పష్టత వస్తుందని తెలిపారు. తనకు భద్రత పెంచమని ముఖ్యమంత్రిని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

తెల్లవారుజామును గం.3.28 నిమిషాలకు ఇంటి వెనుక గోడ దూకి లోనికి వచ్చాడని, కిటికీని తెరిచి లోపలకు వచ్చాడని చెప్పారు. లోనికి వచ్చాక కెమెరాలను ఆపివేశాడని ఆమె వెల్లడించారు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లోనే ఉన్నాడని చెప్పారు. కొన్ని కెమెరాలను ఆపివేసినప్పటికీ, మరికొన్ని కెమెరాలు ఆన్‌లోనే ఉన్నాయని చెప్పారు. సాధారణంగా దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏదైనా తీసుకుపోతాడని, కానీ ఆగంతుకుడు ఏమీ తీసుకుపోలేదని తెలిపారు. కాబట్టి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో విచారణలో తేలుతుందని అన్నారు.


More Telugu News