మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు
  • నిన్న సింహాచ‌లం ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకున్న ద‌ర్శ‌కుడు
  • చిరుతో తీయ‌బోయే మూవీ స్క్రిప్ట్ స్వామి స‌న్నిధిలో పెట్టి పూజ‌లు
  • త‌న సినిమా క‌థ‌ల‌కు విశాఖ‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తాన‌న్న అనిల్‌
  • చిరుతో తీయ‌బోయే చిత్రానికి సంబంధించిన క‌థ‌ను సిద్ధం చేసేందుకు వైజాగ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి
  • మెగాస్టార్‌ సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు స్ప‌ష్టీక‌ర‌ణ‌
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌క‌టించారు. నిన్న సింహాచ‌లం ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారిని ఆయ‌న ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఉన్నారు. చిరుతో తీయ‌బోయే మూవీ స్క్రిప్ట్ స్వామి స‌న్నిధిలో పెట్టి పూజ‌లు నిర్వ‌హించారు. 

ఆల‌యంలోని క‌ప్ప‌స్తంభాన్ని ఆలింగ‌నం చేసుకున్నారు. ఆయ‌న పేరిట అర్చ‌కులు స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. స్వామివారికి పూజ‌ల అనంత‌రం అనిల్ రావిపూడి విలేక‌ర్ల‌తో మాట్లాడారు. త‌న సినిమా క‌థ‌ల‌కు విశాఖ‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తాన‌ని తెలిపారు. అందుకే మెగాస్టార్‌తో తీయ‌బోయే చిత్రానికి సంబంధించిన క‌థ‌ను సిద్ధం చేసేందుకు వైజాగ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. 

ఇక చిరుతో తీసే మూవీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌న్నారు. ఘ‌రానా మొగుడు, గ్యాంగ్‌లీడ‌ర్‌, రౌడీ అల్లుడు సినిమాల్లోని చిరంజీవి మేన‌రిజం ఇందులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఒక నెల‌లో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి, మే చివ‌ర్లో లేదా జూన్ మొద‌టి వారంలో మూవీ షూటింగ్ ప్రారంభిస్తామ‌ని అనిల్ రావిపూడి తెలిపారు. 

కాగా, అనిల్ రావిపూడి, విక్ట‌రీ వెంక‌టేశ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. అలాగే రూ. 300కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.   



More Telugu News