ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ ఎదురుదెబ్బ.. పేస్ సెన్సేషన్ అవుట్!

  • గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న ఉమ్రాన్ మాలిక్
  • అతడి స్థానాన్ని చేతన్ సకారియాతో భర్తీ చేసిన జట్టు
  • ఈ నెల 22న తొలి పోరులో ఆర్సీబీతో కేకేఆర్ ఢీ
ఐపీఎల్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానాన్ని ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాతో భర్తీ చేశారు. ఉమ్రాన్ మాలిక్ 2021 నుంచి 2024 వరకు సైన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు ఆడాడు. అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే, ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో హైదరాబాద్ అతడిని వదులుకుంది. దీంతో కేకేఆర్ అతడిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. 

ఇక, చేతన్ సకారియా ఇటీవలి వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఉమ్రాన్ జట్టు నుంచి తప్పుకోవడంతో సకారియాకు అవకాశం లభించింది. గతంలో అతడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) జట్లకు ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 19 మ్యాచులు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరపున ఒక వన్డే, రెండు టీ20ల్లో ఆడాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 

ఈసారి ఐపీఎల్‌కు ముందు కేకేఆర్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టుకు ట్రోఫీ అందించి పెట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను వదులుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. శ్రేయాస్ స్థానాన్ని అజింక్య రహానేతో భర్తీ చేసింది. కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీ‌బీ) జట్లు తలపడతాయి. ప్రతిష్ఠాత్మక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. 


More Telugu News