గవర్నర్ ను కలిసిన డాక్టర్ సునీతారెడ్డి

  • వివేకా హత్య కేసు దర్యాప్తుపై గవర్నర్ కు డాక్టర్ సునీత ఫిర్యాదు
  • దర్యాప్తు వేగవంతం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి 
  • సాక్షులు ఒక్కొక్కరిగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆవేదన
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి శనివారం (మార్చి 15) నాటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. ఈ కేసు దర్యాప్తు సీబీఐ నిర్వహిస్తోంది. ఈ కేసు నిందితుల్లో ఒకరు మినహా మిగిలిన అందరూ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసులో నిందితులు ఎవరికీ ఇంత వరకు శిక్ష పడలేదు. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని దివంగత వివేకా కుమార్తె డాక్టర్ సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉంది. 

తాజాగా ఈ కేసు విషయంపై సునీతా రెడ్డి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. శనివారం సాయంత్రం ఆమె విజయవాడ‌లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో తన తండ్రి హత్య కేసుపై గవర్నర్‌కు సునీత ఫిర్యాదు చేశారు. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని గవర్నర్‌ను కోరారు. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గవర్నర్ కు సునీత వివరించారు. 

అంతకు ముందు వైఎస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులలో సునీత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఆరేళ్లు అవుతున్నా సీబీఐ కోర్టులో కనీసం ట్రయల్ కూడా ప్రారంభం కాలేదన్నారు. ఈ కేసు దర్యాప్తు‌ను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాక్షులను వాగ్మూలం వెనక్కు తీసుకోవాలని నిందితులు బెదిరిస్తున్నారని సునీత పేర్కొన్నారు.  


More Telugu News