రాజు-కోట-కోటరీ కథ చెప్పిన విజయసాయి

  • ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి
  • జగన్ చుట్టూ కోటరీ ఉందని కొన్ని రోజుల కిందట వ్యాఖ్యలు 
  • తాను కూడా కోటరీ బాధితుడ్నే అని వెల్లడి 
  • తాజాగా జగన్ కోటరీ అంశాన్ని పరోక్షంగా వివరించిన వైనం
జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటుందని, వారు అనుమతిస్తేనే ఎవరైనా జగన్ ను కలవగలరని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. కోటరీ బాధితుల్లో తాను కూడా ఉన్నానని ఆయన వాపోయారు. తాజాగా విజయసాయి మరోసారి కోటరీ అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి ఓ రాజు-కోట కథతో ముందుకువచ్చారు. 

ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ లో ఏముందంటే.... "పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవాళ్లు. కోటలో ఉన్న రాజు గారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, ఆ రాజ్యం ఎలా ఉన్నప్పటికీ... కోటరీ ఆ విషయాలను రాజుకు తెలియకుండా చేసేది. ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దాంతో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. 

ఒకవేళ రాజు తెలివైన వాడు అయితే కోటరీ కుట్రలను గమనించి మారు వేషంలో ప్రజల్లోకి వచ్చేవాడు. ఏం జరుగుతోందో స్వయంగా తానే తెలుసుకునేవాడు. కోటరీ మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజు గారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి... లేదంటే కోటరీ వదలదు... కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!" అని విజయసాయిరెడ్డి వివరించారు.


More Telugu News