పాలస్తీనా అనుకూల నిరసనల్లో భారత విద్యార్థిని.. వీసా రద్దు చేసిన అమెరికా

  • స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికా అధికారులు చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడిన రంజని శ్రీనివాసన్
  • 5న ఆమె వీసాను రద్దు చేసిన అమెరికా విదేశాంగ శాఖ
  • 11న సీపీబీ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛంద బహిష్కరణ
  • కొలంబియా యూనివర్సిటీలో డాక్టోరల్ విద్యార్థినిగా ఉన్న రంజని
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారత యువతి రంజని శ్రీనివాసన్ స్వచ్ఛందంగా దేశాన్ని వదిలిపెట్టింది. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న ఆమె హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారంటూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్చి 5న వీసాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టారు. 

‘ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌కు మద్దుతునిచ్చే కార్యకలాపాల్లో రంజని శ్రీనివాసన్ పాల్గొన్నారు. మార్చి 5న ఆమె వీసాను విదేశాంగశాఖ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 11న స్వీయ బహిష్కరణకు సంబంధించి కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీపీబీ) యాప్‌ను ఉపయోగిస్తున్న ఫుటేజీని హోంల్యాండ్ సెక్యూరిటీ సంపాదించింది’ అని హోంల్యాండ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. 

స్వచ్ఛంద స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికాను విడిచిపెట్టిన రంజని శ్రీనివాసన్.. అధికారులు తనపై చర్యలు తీసుకుని మిలటరీ విమానంలో భారత్‌కు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆమె విమానాశ్రయంలో ఉన్న వీడియోను హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్‌లో షేర్ చేశారు.
 
శ్రీనివాసన్ కొలంబియా యూనివర్సిటీలోని అర్బన్ ప్లానింగ్‌లో డాక్టోరల్ విద్యార్థిని. స్కూల్ వెబ్‌సైట్ ప్రకారం ఆమె కొలంబియా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్ అండ్ ప్రెజెర్వేషన్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. అంతకుముందు ఆమె అహ్మదాబాద్‌లోని సీపీఈటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అలాగే, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. 


More Telugu News