రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభానికి ముందు యువకుడి కాల్చివేత

  • ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఘటన
  • రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తుల ఘాతుకం
  • వ్యక్తిగత కక్షలే కారణమన్న పోలీసులు
రంజాన్ ఉపవాసం ప్రారంభానికి ముందు 25 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిందీ ఘటన. వ్యక్తిగత వివాదమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. రెండు బైకులపై వచ్చిన నలుగురు నిందితులు రోడ్డుపై నిల్చున్న హారిస్ అలియాస్ కట్టాపై తుపాకితో కాల్చి జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిందీ ఘటన. 

ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కాల్పుల ఘటన అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తులు యువకుడిపై పలుమార్లు కాల్పులు జరపడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

అయితే, ఈ ఘటనకు వ్యక్తిగత కక్షలే కారణమైన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులతో హారిస్‌కు గొడవలు ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 


More Telugu News