టొమాటో రైతులకు గుడ్ న్యూస్.. 6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లు: ఏపీ మంత్రి టీజీ భరత్

  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లతో ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్న మంత్రి భరత్
  • పత్తికొండలో రూ.11 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ
  • ఇకపై టొమాటో లు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఎక్కడా ఉండదని వెల్లడి
ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి టీజీ భరత్..ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కర్నూలు ఎంపీ, పత్తికొండ ఎంఎల్ఏలు ఇటీవల ముఖ్యమంత్రిని కోరగా, వెంటనే అందుకు సంబంధించిన పనులు చేయాలని సీఎం ఆదేశించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కొరకు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో టొమాటో పంట సాగు చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. 

ఈ యూనిట్ ఏర్పడిన తర్వాత టొమాటో‌లు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఎక్కడా ఉండదన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా మంది ఈ యూనిట్‌లు పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. అదే విధంగా తుగ్గలి, దేవనకొండ, కృష్ణగిరి, ఆదోని, గొనేగండ్ల, ఆస్పరి, ఆలూరు ప్రాంతాల వారికి ఈ యూనిట్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు. 
 
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంశం‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సమయంలో ఈ 5 ఏళ్లలో 30 వేల కోట్ల పెట్టుబడులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా రావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, టార్గెట్ పెట్టుకొని కష్టపడుతున్నట్లు చెప్పారు. వలసలు నివారించి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో చాలా మేరకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయన్నారు. 
 
ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


More Telugu News