తమిళనాడుతోసహా భారతదేశం అంతటికీ కావాల్సింది రెండు భాషలు కాదు... బహు భాషలు కావాలి: పవన్ కల్యాణ్

  • జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
  • పలు భాషల్లో ప్రసంగించిన జనసేనాని
  • ఇతర రాష్ట్రాల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని వెల్లడి
జనసేన 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు భాషల్లో ప్రసంగించారు. తద్వారా, ఆయా రాష్ట్రాల్లోని తన అభిమానులను అలరించారు. ఇవాళ సీనియర్ నాయకుడు కొణతాల చెప్పినట్టుగా... నేడు హోలీ పండుగ రోజు, జనసేన జయకేతనం సభ ఒక్కరోజే రావడం యాదృచ్ఛికం కాదు... అది భగవంతుడి నిర్ణయం అని పేర్కొన్నారు. 

ఇతర రాష్ట్రాల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని వెల్లడించారు. ఇటీవల తాను తమిళనాడులో షణ్ముఖ యాత్ర చేసినప్పుడు మీ ప్రసంగాలు చూస్తుంటాం అని అక్కడి వారు చెప్పారని వెల్లడించారు. మహారాష్ట్రలో పర్యటించాలని దేవేంద్ర ఫడ్నవీస్ కోరారని, హర్యానాలోనూ పర్యటించాలని కోరారని వివరించారు. ఎన్డీఏ కూటమి కోసం తాను మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని... తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్కటి తప్ప అన్ని చోట్లా కూటమి గెలిచిందని తెలిపారు. ఈ క్రమంలో పవన్ హిందీ, తమిళం, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రసంగించారు. 

ఈ సందర్భంగా  తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న భాషా వివాదంపై పరోక్షంగా స్పందించారు. తమిళనాడుతో సహా భారతదేశమంతటికీ రెండు భాషలు కాదని బహుభాషలు ఉండాలని అభిలషించారు. ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలంటే భారతదేశానికి బహుభాషా విధానమే మంచిదని అభిప్రాయపడ్డారు. బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేశారు.


More Telugu News