ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలకు వాళ్లే కారణం: రికీ పాంటింగ్

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలకు వాళ్లే కారణం: రికీ పాంటింగ్
  • భారత విజయంలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర అని కొనియాడిన పాంటింగ్
  • జడేజా, అక్షర్, పాండ్యా అద్భుత ప్రదర్శన చేశారని కితాబు
  • ఆల్ రౌండర్ల కారణంగా జట్టులో సమతూకం వచ్చిందని వెల్లడి 
  • నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ లేకపోయినా విజయం సాధించారని ప్రశంసలు
భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించడానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల అనుభవం మాత్రమే కాకుండా, ఆల్‌రౌండర్ల అద్భుత ప్రదర్శన కూడా కారణమని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ కొనియాడాడు. ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ పాంటింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్లు విశేషంగా రాణించారని ప్రశంసించాడు. జట్టులో యువత, అనుభవం కలగలిపి ఉండటం వల్ల భారత్‌ను ఓడించడం కష్టమని టోర్నమెంట్ ప్రారంభంలోనే తాను చెప్పానని గుర్తు  చేశాడు. దానికితోడు ఫైనల్‌లో కెప్టెన్ తన జట్టు కోసం నిలబడి విజయాన్ని అందించాడని పాంటింగ్ వివరించాడు.

ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ముగ్గురు ఆల్‌రౌండర్లను తుది జట్టులో ఆడించింది. తద్వారా బ్యాటింగ్ లైనప్‌ బలోపేతం కావడంతో పాటు బౌలింగ్‌లోనూ వెసులుబాటు కలిగింది.

టోర్నీ ఆసాంతం భారత జట్టు బాగా సమతూకంతో ఉందని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో జట్టు కూర్పు మరింత బలంగా తయారైందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అక్షర్ పటేల్‌ను కొన్నిసార్లు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించారని, జడేజా కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడని గుర్తు చేశాడు. అయితే, జట్టులో ఫాస్ట్ బౌలింగ్ కాస్త తక్కువగా ఉందనిపించిందని, కానీ ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని  పాంటింగ్ పేర్కొన్నారు.

హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ చేయగలగడం, ప్రారంభ ఓవర్లు వేయడం స్పిన్నర్లకు మరింత సులువు చేసిందని పాంటింగ్ అన్నాడు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో ఆధిపత్యం చెలాయించడానికి ఇది ఉపయోగపడిందని తెలిపాడు. 

అక్షర్ పటేల్‌ను పాంటింగ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అతను టోర్నమెంట్‌లో నిలకడగా రాణించాడని, అతని బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా ఉందని కితాబిచ్చాడు.. బ్యాటింగ్‌లోనూ కీలక సమయాల్లో ఆదుకున్నాడని, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా వంటి వారు మరింత సులువుగా ఆడేందుకు సహకరించాడని పాంటింగ్ పేర్కొన్నారు. అక్షర్ పటేల్ ఈ టోర్నమెంట్‌లో ప్రశంసలు అందుకోవడానికి అర్హుడని ఆయన అభిప్రాయపడ్డాడు.


More Telugu News