తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించకపోతే టీటీడీతో తేల్చుకుంటాం: రఘునందన్ రావు

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించకపోతే టీటీడీతో తేల్చుకుంటాం: రఘునందన్ రావు
  • లేఖలు అంగీకరించకుంటే తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని వ్యాఖ్య
  • శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న బీజేపీ ఎంపీ
  • ఈ విషయంపై చంద్రబాబు స్పందించాలన్న రఘునందన్ రావు
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించకపోతే ప్రజాప్రతినిధులం అందరం తిరుమలకు వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటనను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నరు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో తమ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించాలని, లేదంటే టీటీడీతో తేల్చుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే స్పందించాలని అన్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని బీఆర్ నాయుడు నాయకత్వంలోని టీటీడీ బోర్డు ప్రకటించిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఎమ్మెల్యేలకు అనుమతి ఉండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పట్ల వివక్ష ఉండవద్దని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైతే సిఫార్సు లేఖలను అంగీకరించారో, ఇప్పుడు అలాగే అంగీకరించాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరారు.


More Telugu News