హార్ట్ ఎటాక్‌ రాకుండా టీకా.. చైనా శాస్త్రవేత్తల ఘనత!

హార్ట్ ఎటాక్‌ రాకుండా టీకా.. చైనా శాస్త్రవేత్తల ఘనత!
  • గుండెపోటు రాకుండా అడ్డుకునే టీకాను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
  • ఎలుకల్లో చేసిన ప్రయోగం విజయవంతం
  • గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను క్లియర్ చేసే వ్యాక్సిన్
ఇటీవలి కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ హార్ట్ ఎటాక్ కబళిస్తోంది. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. చిన్నారులు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ఈ నేపథ్యంలో గుండెపోటును ముందుగానే అడ్డుకునే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం సమీప దూరంలోనే ఉంది. ఈ విషయంలో చైనా పరిశోధకులు చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్‌జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకా ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు ఇచ్చింది. అథెరోస్ల్కెరోసిస్ నివారణలో ఈ టీకా అద్భుతంగా పనిచేసింది.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నే అథెరోస్ల్కెరోసిస్ అంటారు. దీనివల్ల గుండెకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా స్ట్రోక్, గుండెపోటు వస్తాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అథెరోస్ల్కెరోసిస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక తెల్ల రక్త కణాలు క్రియాశీలమై యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా రోగ నిరోధకశక్తి మెరుగుపడి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. కాగా, మన దేశంలో 40-69 వయసు వారిలో మరణాలకు 45 శాతం హార్ట్ ఎటాకే కారణమని తేలింది. 


More Telugu News