హెడ్మాస్ట‌ర్ గుంజీలపై స్పందించిన మంత్రి లోకేశ్‌.. ఆలోచ‌న బాగుందంటూ అభినంద‌న‌లు!

హెడ్మాస్ట‌ర్ గుంజీలపై స్పందించిన మంత్రి లోకేశ్‌.. ఆలోచ‌న బాగుందంటూ అభినంద‌న‌లు!
  
పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని.... పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ విద్యార్థుల‌తో గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై ఏపీ ఐటీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.  

అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తార‌ని హెడ్మాస్ట‌రుతో మంత్రి అన్నారు. విద్యార్థుల‌ను దండించ‌కుండా అర్థం చేసుకునేలా స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుందంటూ ప్ర‌ధాన ఉపాధ్య‌యుడికి లోకేశ్‌ అభినంద‌న‌లు తెలిపారు.  

"విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గారు పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని.... విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా నా దృష్టికి వ‌చ్చింది. హెడ్మాస్ట‌రు గారూ!  అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుంది, అభినంద‌న‌లు. అందరం క‌లిసి విద్యాప్ర‌మాణాలు పెంచుదాం. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దాం" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. దీనికి హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గుంజీలు తీసిన‌ వీడియోను జోడించారు. 


More Telugu News