ఆ శాఖను అడిగి మరీ తీసుకున్నా: మంత్రి నారా లోకేశ్

ఆ శాఖను అడిగి మరీ తీసుకున్నా: మంత్రి నారా లోకేశ్
  • వైసీపీ పాలనలో విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ పతనమయ్యాయన్న లోకేశ్
  • వీసీల నియామకాల్లో పారదర్శకత లోపించిందని విమర్శలు
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభివృద్ధి జరిగిందని వెల్లడి 
  • విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని స్పష్టీకరణ 
జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించారని, దీనివల్ల రాష్ట్రంలోని ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. 

విద్యారంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... విద్యాశాఖ భారం కాదు... నా బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఏ శాఖ కావాలని అడిగినప్పుడు కఠిన శాఖ ఇవ్వాలని కోరాను... అందులో భాగంగా నేనే విద్యాశాఖ కావాలని స్వయంగా అడిగాను. అసమానతలు పోవాలంటే విద్యతోనే సాధ్యం అని చెప్పాను... అని లోకేశ్ వివరించారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ, 2014 నుంచి 2019 వరకు జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ లో 200 లోపు ర్యాంకుల్లో రాష్ట్రంలోని 9 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) 2019లో 29వ ర్యాంకులో ఉండగా, ప్రస్తుతం 41వ ర్యాంకుకు పడిపోయిందని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) 72 నుంచి 100-150 మధ్యకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) గతంలో ర్యాంకింగ్ కు ఎంపిక కాకపోయినా, 2024లో 97వ స్థానానికి చేరుకుందని తెలిపారు. 

జేఎన్టీయూ అనంతపూర్, కాకినాడ, ఎస్కేయూ, పద్మావతి మహిళా యూనివర్సిటీలు ర్యాంకింగ్ కు ఎంపిక కాలేదని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ఐటీ వరంగల్ లో పనిచేసిన అనుభవజ్ఞులను వీసీలుగా నియమించిందని ఆయన గుర్తు చేశారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి తమ వైస్ ఛాన్సలర్ ను తీసుకువెళ్లారని, తాము నియమించిన వీసీలు ఎవరూ తమ బంధువులు కానీ, స్నేహితులు కానీ కాదని లోకేశ్ స్పష్టం చేశారు. 

విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఐఐఐటీలకు గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారని, గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఛాన్సలర్ గా చేసే ప్రయత్నం చేసిందని, దానిని తాము రద్దు చేసి తిరిగి గవర్నర్ కే ఆ బాధ్యత అప్పగించామని లోకేశ్ తెలిపారు.


More Telugu News