ఆ స్టోరీ ఏంటో నాకు కూడా తెలియదు: వసీం అక్రమ్

ఆ స్టోరీ ఏంటో నాకు కూడా తెలియదు: వసీం అక్రమ్
  • ఛాంపియన్స్ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవ వేళ కనిపించని పీసీబీ ప్రతినిధులు
  • మండిపడుతున్న పాక్ క్రికెట్ మాజీలు
  • కనీసం వేదికపై ఒక్కరున్నా బాగుండేదన్న అక్రమ్
దుబాయ్ లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఒక్క అధికారి కూడా కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. టోర్నీ ఆతిథ్య దేశం అయ్యుండి, కనీసం ప్రైజ్ ఇచ్చేటప్పుడు పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఒక్క ప్రతినిధి కూడా అక్కడ లేకపోవడం పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్లే మండిపడుతున్నారు. 

తాజాగా, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ కూడా ఇదే అంశంపై స్పందించారు. "మనం టోర్నీ ఆతిథ్య దేశంగా ఉన్నాం.... ఏం, కాదా? కనీసం పీసీబీ నుంచి ఒక్కరు కూడా బహుమతి ప్రదానోత్సవం వద్ద కనిపించకపోవడం ఏంటి? 

నాకు తెలిసినంత వరకు పీసీబీ చైర్మన్ కు ఆరోగ్యం సరిగా లేదు. దాంతో పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్, పీసీబీ ఇంటర్నేషనల్ వ్యవహారాల డైరెక్టర్ ఉస్మాన్ వహ్లా దుబాయ్ వచ్చారు. కానీ వారిద్దరిలో ఒక్కరు కూడా ప్రైజులు ఇచ్చే స్టేజి వద్ద కనిపించలేదు. వాళ్లను స్టేజి మీదికి ఎవరైనా ఆహ్వానించలేదా? 

ఆ స్టోరీ ఏంటో నాకు తెలియదు. కానీ నాతో సహా చూసేవాళ్లకు మాత్రం ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది. కనీసం పీసీబీ నుంచి స్టేజి మీదకు ఒక్కరైనా వస్తే బాగుండేది...  వాళ్లు  కప్ బహూకరించారా, మెడల్స్ ఇచ్చారా అనేది అనవసరం... కనీసం ఒకరు వేదికపై ఉంటే గౌరవంగా ఉండేది" అని అక్రమ్ వివరించారు.


More Telugu News