అప్పుడు అలా అనుకున్నా.. ద‌ర్శ‌కుల‌పై ప్ర‌శాంత్ నీల్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • కెరీర్ తొలినాళ్ల‌లో సినీ ప‌రిశ్ర‌మపై త‌న అభిప్రాయం ఎలా ఉండేదో చెప్పిన ప్ర‌శాంత్ నీల్‌
  • తాజాగా న‌టి అమ‌ల‌తో క‌లిసి ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు
  • ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క విష‌యాల‌ను పంచుకున్న డైరెక్ట‌ర్‌
కేజీఎఫ్ చాప్ట‌ర్‌-1, 2ల‌తో పాటు 'స‌లార్' మూవీతో క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్‌టీఆర్‌తో ఒక సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఆయ‌న న‌టి అమ‌ల‌తో క‌లిసి పాల్గొన్న ఓ కార్య‌క్ర‌మంలో తాను సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌లో త‌న‌కు ఎలాంటి ఆలోచ‌న ఉండేదో వివ‌రించారు. ఆ స‌మ‌యంలో అప్ప‌టివ‌ర‌కూ సినిమాలు తీసిన వారంద‌రూ బ్యాడ్ డైరెక్ట‌ర్స్‌ అని భావించానని... తానే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మార్పులు తీసుకురావాల‌ని భావించార‌ట‌. కానీ, ఆ త‌ర్వాత వాస్త‌వం గ్ర‌హించాన‌ని నీల్ పేర్కొన్నారు. 

"సినిమా చూడ‌టం అనేది తేలికైన ప‌ని. కానీ, తెర‌కెక్కించ‌డం చాలా క‌ష్టం. 2014లో నేను తీసిన తొలి మూవీ 'ఉగ్రం'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకాక ముందు... 'ఇప్ప‌టివ‌ర‌కూ సినిమాలు తెర‌కెక్కించిన వారంతా బ్యాడ్ డైరెక్ట‌ర్స్ (నవ్వుతూ). చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌న‌మే మార్పు తీసుకురావాలి' అని అనుకునేవాడిని. కానీ, మూవీ చిత్రీక‌ర‌ణ కొంత భాగం పూర్త‌య్యాక అస‌లు విష‌యం అర్థ‌మైంది. 

ఈ సినిమా 10 మంది వీక్షించినా చాలు అనిపించింది. మూవీ నిర్మాణానికి టీమ్ వ‌ర్క్ చాలా అవ‌స‌ర‌మ‌ని, అప్పుడే విజ‌యం సాధించ‌గ‌ల‌మ‌ని గ్ర‌హించాను. అందుకే ఫిల్మ్ మేకింగ్ అనేది టెన్నిస్‌లాంటిది కాదు, క్రికెట్‌లాంటిది. జ‌ట్టుగా ప‌నిచేయాల్సి ఉంటుంది" అని ప్ర‌శాంత్ నీల్ అన్నారు. 


More Telugu News