గోవాలో ప‌ర్యాట‌కుల సంఖ్య త‌గ్గ‌డంపై ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

గోవాలో ప‌ర్యాట‌కుల సంఖ్య త‌గ్గ‌డంపై ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
  • గోవా బీచ్‌లో ఇడ్లీ-సాంబార్ విక్ర‌యించ‌డం వ‌ల్లే విదేశీ పర్యా‌ట‌కులు రావ‌డం లేద‌న్న ఎమ్మెల్యే మైఖేల్ లోబో   
  • బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన‌వారు బీచ్‌లో వ‌డా పావ్‌లు అమ్ముతున్నార‌ని వ్యాఖ్య‌
  • అందుకే గ‌డిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యా‌ట‌కుల తాకిడి త‌గ్గింద‌న్న ఎమ్మెల్యే 
గోవాలో గ‌త కొంత‌కాలంగా పర్యా‌ట‌కుల సంఖ్య త‌గ్గ‌డంపై స్థానిక‌ బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డి బీచ్‌లో వ‌డా పావ్‌, ఇడ్లీ-సాంబార్ విక్ర‌యించ‌డం వ‌ల్లే విదేశీ పర్యా‌ట‌కులు రావ‌డం లేద‌న్నారు. ద‌క్షిణ గోవాలోని క‌లంగూట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన‌వారు బీచ్‌లోని షాపుల్లో వ‌డా పావ్‌లు విక్ర‌యిస్తున్నారు. మ‌రికొంద‌రు ఇడ్లీ-సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గ‌డిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యా‌ట‌కుల తాకిడి త‌గ్గింది. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది అని ఎమ్మెల్యే లోబో చెప్పుకొచ్చారు. 

అయితే, ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు ఏ విధంగా గోవా పర్యాట‌కంపై ప్ర‌భావం చూపాయ‌నే విష‌యాన్ని మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. ఇక ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం వ‌ల్ల ఇరు దేశాల‌కు చెందిన పర్యా‌ట‌కులు గోవాకు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఇలా గోవాకు విదేశీ సంద‌ర్శ‌కులు త‌గ్గ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. 

ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారికి గోవా వాసులు త‌మ దుకాణాల‌ను అద్దెకు ఇవ్వ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. స్థానిక ట్యాక్సీలు, క్యాబ్‌ల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయని, వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించ‌కుంటే పర్యాటక రంగానికి చీక‌టి రోజులేన‌ని చెప్పుకొచ్చారు. 

టూరిజం శాఖ‌తో పాటు భాగ‌స్వామ్య ప‌క్షాలు సంయుక్తంగా భేటీ అయి చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గోవాలో విదేశీ టూరిస్టుల‌ సంఖ్య త‌గ్గ‌డానికి ప్ర‌భుత్వం ఒక్క‌టే కార‌ణం కాద‌ని, అంద‌రూ దీనికి బాధ్యులేన‌ని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు.  


More Telugu News