ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు: మంత్రి కందుల దుర్గేశ్

ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు: మంత్రి కందుల దుర్గేశ్
  • పర్యాటక రంగంలో పెట్టుబడులకు మంత్రి కందుల దుర్గేశ్ ఆహ్వానం
  • ఢిల్లీలో సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025లో పాల్గొన్న మంత్రి 
  • పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి
  • ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 (ఎస్ఏటీటీఈ)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని, తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి కూడా వర్తిస్తాయని తెలిపారు.

ఏపీలో పర్యాటక అభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ 2024-29ని తీసుకువచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్‌ హబ్‌లు, థీమాటిక్‌ అప్రోచ్‌ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన వంటి విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు.  

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, ఫిల్మ్ టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. పర్యాటక రంగం ద్వారా 15 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆహ్లాదంగా ఉంటూ ఎక్కువ రోజులు గడిపేలా మెరుగైన సేవలు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి దుర్గేశ్ అన్నారు. 


More Telugu News