కుంభమేళాలో బ్రాహ్మణులకు వస్త్రదానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు

కుంభమేళాలో బ్రాహ్మణులకు వస్త్రదానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు
  • యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా
  • నేడు కుటుంబ సమేతంగా తరలి వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించిన వైనం 
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ర్, బ్రాహ్మణి దంపతులు బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేశ్ దంపతులు మమేకమయ్యారు. 

మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు... ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం అని... నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక అని లోకేశ్ పేర్కొన్నారు. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. 

పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకమని అభిప్రాయపడ్డారు. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేశ్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.


More Telugu News