విశాఖలో జీబీఎస్ తో ఎలాంటి మరణం సంభవించలేదు: కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద

విశాఖలో జీబీఎస్ తో ఎలాంటి మరణం సంభవించలేదు: కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద
  • ఏపీలో నమోదవుతున్న గులియన్ బారే సిండ్రోమ్ కేసులు
  • గుంటూరులో గత రాత్రి ఓ మహిళ మృతి
  • రాష్ట్రంలో భయాందోళనలు
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) భయాందోళనలు కలిగిస్తోంది. దీనిపై విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద స్పందించారు. విశాఖలో జీబీఎస్ తో ఎలాంటి మరణం సంభవించలేదని స్పష్టం చేశారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని అన్నారు. 

గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల కోసం కేజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు ఐదు అనుమానిత కేసులు వచ్చాయని, వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపామని డాక్టర్ శివానంద తెలిపారు. 

కాగా, ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే మహిళ జీబీఎస్ కు చికిత్స పొందుతూ... గతరాత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది. 

దీనిపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి స్పందించారు. కమలమ్మ కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిందని వెల్లడించారు. జీబీఎస్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీంట్లో మరణాల శాతం చాలా తక్కువ అని పేర్కొన్నారు.


More Telugu News