చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ
  • దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ
  • దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఉదయం రంగరాజన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. 'రామరాజ్యం' వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కొద్ది రోజుల క్రితం రంగరాజన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

నేడు మంద కృష్ణ మాదిగ... రంగరాజన్‌ను కలిసిన సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్చకుడిపై దాడి దారుణమని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనలో రంగరాజన్‌కు న్యాయం జరిగే వరకు ఆయనకు తోడుగా ఉంటామని ఆయన తెలిపారు. రంగరాజన్‌ను కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగతో పాటు మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు ఉన్నారు.

అంతకుముందు, బీజేపీ నేత, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈ ఘటన జరిగిన వెంటనే రంగరాజన్‌ను కలవలేకపోయానని, ఈరోజు కలిశానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో రంగరాజన్‌కు అండగా ఉంటామని ఆయన అన్నారు.


More Telugu News