ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరైన దస్తగిరి

ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరైన దస్తగిరి
  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి
  • కడప జైల్లో తనకు బెదిరింపులు ఎదురయ్యాయని గతంలో ఫిర్యాదు
  • విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
  • విచారణ అధికారిగా రాజమండ్రి జైలు సూపరింటిండెంట్ రాహుల్
  • నేడు కడప జైల్లో విచారణ 
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి కడప జైల్లో ఎదురైన బెదిరింపులపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ రాహుల్ శ్రీరామను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు. దస్తగిరిని ఇబ్బందిపెట్టిన ఘటనపై నేడు కడప జైల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో, దస్తగిరి నేడు విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ముందు హాజరయ్యారు.

2023 నవంబరులో తనకు ఎదురైన బెదిరింపులను దస్తగిరి వివరించారు. తనను ప్రలోభాలకు గురిచేసిన అంశాన్ని కూడా దస్తగిరి ఎంక్వైరీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటిండెంట్ ప్రకాశ్ తనను ఇబ్బందిపెట్టినట్టు దస్తగిరి ఆయనకు ఫిర్యాదు చేశాడు. 

ఎంక్వైరీ ఆఫీసర్ రాహుల్... డాక్టర్ చైతన్యరెడ్డి, జైలు సూపరింటిండెంట్ ప్రకాశ్ లను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాక... మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడం సంచలనం సృష్టించింది. దాంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా నిందితులుగా ఉండడం తెలిసిందే.


More Telugu News