జైల్లో దస్తగిరికి బెదిరింపులపై విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం

జైల్లో దస్తగిరికి బెదిరింపులపై విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
  • దస్తగిరి ఫిర్యాదుతో ఈ నెల 5న కేసు నమోదు
  • నిందితులుగా ప్రకాశ్, డాక్టర్ చైతన్యరెడ్డి, నాటి డీఎస్పీ, సీఐలు నాగరాజు, ఈశ్వరయ్య
  • విచారణా అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ 
  • నేడు, రేపు కడప సెంట్రల్ జైలులో విచారణ  
 వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడప జైలులో బెదిరింపులకు గురి చేసిన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహల్‌ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది.  

దస్తగిరి ఫిర్యాదుతో ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాశ్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదు కాగా, అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశపూర్వక దాడి, హాని కలిగించడం, తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని బెదిరించడం తదితర అభియోగాలు నమోదు చేయడం జరిగింది. 

2023 అక్టోబర్, నవంబర్ నెలల్లోనే తనను బెదిరించారని అప్పట్లో దస్తగిరి, ఆయన భార్య పలు మార్లు ఫిర్యాదు చేసినా, మీడియా ముఖంగా చెప్పినా వైసీపీ అధికారంలో ఉండటంతో కేసు నమోదు కాలేదు. అనాటి ఘటనపై రెండు రోజుల క్రితం దస్తగిరి ఫిర్యాదు చేశాడు. దీంతో పులివెందుల పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 5న కేసు నమోదైంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాజమండ్రి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహల్‌ను ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించింది. 

శుక్రవారం ఉదయం కడప సెంట్రల్ జైలులో విచారణాధికారి రాహుల్ దస్తగిరిని ప్రశ్నించనున్నారు. అనంతరం ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ చైతన్యరెడ్డి, ప్రకాశ్‌లను విచారణకు పిలవనున్నారు. శుక్రవారం, శనివారం కడప జైలులో ఆయన విచారణ కొనసాగించనున్నారు.   


More Telugu News