ఏపీ వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు

ఏపీ వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందనలు
  • ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలు
  • వెయిట్ లిఫ్టింట్ లో ఏపీ క్రీడాకారుల హవా
  • 87 ప్లస్ కిలోల కేటగిరీలో సత్యజ్యోతికి కాంస్యం
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో నీలం రాజు, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా, 87 ప్లస్ కిలోల కేటగిరీలో రాష్ట్రానికే చెందిన టి.సత్యజ్యోతి కాంస్యం సాధించింది. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"విజయనగరంకు చెందిన సత్యజ్యోతికి కంగ్రాచ్యులేషన్స్. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో సత్యజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో 87 ప్లస్ కిలోల కేటగిరీలో కాంస్యం సాధించింది. నీకు మరింత శక్తి కలగాలని కోరుకుంటున్నాను అమ్మా! మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

నీవంటి మహిళ మాకందరికీ ప్రేరణ: నారా లోకేశ్

విజయనగరంకు చెందిన టి.సత్యజ్యోతి జాతీయ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో కాంస్యం సాధించినందుకు అభినందిస్తున్నాను అంటూ మంత్రి లోకేశ్ కూడా ట్వీట్ చేశారు. 

"నీ కఠోర శ్రమ, అంకితభావం, స్ఫూర్తి మాకందరికీ ప్రేరణ. నీవంటి మహిళ అడ్డంకులను అధిగమించి వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఎదగడం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఎప్పుడూ విజయాలు సాధిస్తూ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మంత్రి లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.


More Telugu News