ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం
  • ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా విధులు నిర్వహించనున్న ఆర్పీ ఠాకూర్ 
  • రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న ఆర్పీ ఠాకూర్
  • ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా
మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ విధులు నిర్వహిస్తారని, ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్పీ ఠాకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) ఏడీజీగా, అనంతపురం, చిత్తూరు డీఐజీగా, 2016 నవంబర్ 19 నుంచి ఏపీ అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2018 జులై 1 నుంచి 2019 జూన్ 1 వరకు ఏపీ డీజీపీగా కొనసాగారు. అనంతరం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా, తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు ఇద్దరు విశ్రాంత సీనియర్ ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. శనివారమే విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా, ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. 


More Telugu News