వినోద్ కాంబ్లీకి విడాకులు ఇవ్వాల‌నుకున్నా.. కానీ: ఆండ్రియా హెవిట్‌

వినోద్ కాంబ్లీకి విడాకులు ఇవ్వాల‌నుకున్నా.. కానీ: ఆండ్రియా హెవిట్‌
  • ఇటీవ‌ల తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న కాంబ్లీ
  • తాగుడుకు బానిసైన అత‌నికి 2023లో విడాకులు ఇవ్వాల‌నుకున్న‌ట్లు చెప్పిన ఆండ్రియా
  • కానీ, కాంబ్లీ ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు వెల్ల‌డి
భారత జట్టు మాజీ క్రికెట‌ర్‌ వినోద్ కాంబ్లీతో వివాహ బంధంపై రెండో భార్య ఆండ్రియా హెవిట్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాగుడుకు బానిసైన అత‌నికి తాను 2023లో విడాకులు ఇవ్వాల‌నుకున్న‌ట్లు తెలిపారు. అయితే, తన భర్త నిస్సహాయ స్థితి చూసి ఆ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్న‌ట్లు ఆమె వెల్లడించారు. కాంబ్లీ ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్న‌ట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కాంబ్లీ మ‌ద్యం వ్యసనం త‌మ వివాహ బంధాన్ని ఎలా ప్రభావితం చేసింద‌నే విష‌యాన్ని ఆండ్రియా వెల్ల‌డించారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సూర్యాంశీ పాండే హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ, తాను కాంబ్లీని విడిచిపెట్టాలని గతంలో ఆలోచించానని, అయితే అతని ఆరోగ్యం గురించి ఆందోళన కార‌ణంగా ఆ ఆలోచ‌నను విర‌మించుకున్న‌ట్లు తెలిపారు. 

"నేను అతనిని విడిచిపెడితే అతను నిస్సహాయంగా ఉండిపోతాడు. ఆయ‌న డైలీ ప‌నుల కోసం ఎవ‌రో ఒక‌రు తోడు ఉండాల్సిందే. ప్రస్తుతం అత‌ని ప‌రిస్థితి చిన్నపిల్లాడిలా ఉంది. అది నన్ను బాధపెడుతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో నా స్నేహితులు ఉన్నా కూడా నేను వారిని వదిలిపెట్టను. అలాంటిది అతను నాకు అంతకంటే ఎక్కువ. ఈ విష‌యం గురించి ఆలోచించే నేను అప్పుడు భయపడి ఉంటాను. అందుకే విడాకుల నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నాను" అని ఆండ్రియా చెప్పుకొచ్చారు.

ఇక ఇటీవల వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 50వ వార్షికోత్సవ వేడుకలకు వినోద్ కాంబ్లీ హాజరయ్యారు. ఆ స‌మ‌యంలో భార్య ఆండ్రియా హెవిట్ అత‌నికి సహాయం చేయడం కనిపించింది. కాగా, గత కొంతకాలంగా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీకి ఇటీవ‌ల‌ మెదడులో ర‌క్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డ కొన్ని రోజుల చికిత్స‌ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.


More Telugu News